Tuesday, February 17, 2009

శోభనం!

శోభనం!

ప్రతి పురుషుడూ (పెళ్ళైనా కాకపోయినా, పెళ్ళైతే ఇంకా తొందరగా జరగాలని) ఇష్టపడేది!

గోదావరి జిల్లాల్లో, శూద్ర కులాల్లో యానాళ్ళు గా వ్యవహరించే దీన్ని, శ్రోత్రియులు ‘పునస్సంథానం ‘ అనీ, ఆడవాళ్ళు ‘కార్యం’ అనీ, పురోహితులు ‘గర్భాదానం ‘ అనీ, సామాన్యులు ‘గదిలోకి పంపడం ‘ అనీ, యానాళ్ళంటే పెళ్ళి కొడుక్కి సంబంధించిన వాళ్ళు తాగి తందనాలాడే సమయం అనీ, కొంత మంది ‘భూకంప ముహూర్తం‘ అనీ, ఇంకొంతమంది ‘స్థంభ ముహూర్తం‘ అనీ, మరి కొంత మంది ‘చిలకల పండగ’ అనీ (గదిలో పంచదార చిలకలు పెడతారు కదా!) రకరకాలుగా వ్యవహరిస్తారు!

ఇదివరకు, ‘ఆష్టవర్షాత్ భవేత్కన్యాం’ అని యెనిమిదేళ్ళలోపే ఆడ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసేవారు! కొండొకచో, కన్యాశుల్కం అమల్లో వున్న రోజుల్లో, కడుపులో వున్న బిడ్డలకి కూడా పెళ్ళిళ్ళు చేసేసే వారు! (అంటే పుట్టిన వెంటనే—ఆడ పిల్ల అని తెలిసిన వెంటనే అనుకోండి!)

ఆ తరవాత, కొన్ని సంవత్సరాల తరవాత, పిల్ల వ్యక్తురాలైనప్పుడు, ఆడపిల్ల తండ్రి మళ్ళీ అల్లుడి తండ్రిని సంప్రదించి, మళ్ళీ కొన్ని కానుకలు ఇచ్చుకొని, ‘పునస్సంధానానికి’ (పెళ్ళి అంటే సంధానం) అనుమతిబడసి, వారిని మళ్ళీ సకుటుంబ సపరివార సమేతంగా ఆహ్వానించి, జరిపించేవారు.

ఇప్పుడు—(శంకరాభరణం లో పట్టాభి అన్నట్లు) ‘రైళ్ళు, బస్సులు, రాకెట్లు, జాకెట్లు, జట్లు—అన్నీ వచ్చేసాయా! స్పీడు! లోకమంతా స్పీడే!'—అన్నట్లు—పెళ్ళి నిశ్చయమయ్యాక, రెండు మూడు నెల్లు టైముంటే, సెల్ఫోను లోనే ముద్దూముచ్చట్లు కానిచ్చేసి, ఇంకా వీలైతే యేకాంతాలు గడిపేసి, కొండొకచో ‘అదీ’ కానిచ్చేసి, పెళ్ళి ముహూర్తం ఏ అర్ధరాత్రో అయితే, యేడు గంటలకి రిసెప్షను పేరుతో ఇద్దర్నీ పక్కపక్కని కూచోబెట్టి, టాకింగులూ, టచ్చింగులూ, ఒకచో కిస్సింగులూ అయ్యాక, ముహూర్తం అవగానే, శోభనాలూ కానిచ్చేస్తున్నారు!

బాగుంది గానీ, ఇప్పుడో చిన్న సమస్య! యేమిటంటే, ఆడ పిల్లలు తక్కువైపోయారు!

అబ్బాయిలూ! జాగ్రత్త! మళ్ళీ కన్యాశుల్కం రోజులు వస్తున్నాయి!

చూద్దామా?

2 comments:

krishna rao jallipalli said...

గురువు గారూ... భలే చెప్పారుగా.

A K Sastry said...

డియర్ క్రిష్ణారావ్!

ధన్యవాదాలు!