Thursday, April 15, 2010

ఓ సరసమైన కథ

ఓ రాత్రి కథ

ఓ పాతికేళ్ళక్రితం ఓ తెలుగు కథానిక చదివాను. ఇంటిపేరుతో సహా ఓ అయిదారు అక్షరాలుండే ఓ రచయిత్రి వ్రాసిందని గుర్తు. ఆవిడ పేరు గుర్తులేదు. స్వాతి వీక్లీలోనో, ఆంధ్ర భూమి వీక్లీలోనో చదివిన గుర్తు.

కథ టూకీగా.............

నిజామాబాదు నించో యెక్కడి నించో మన హీరోయిన్ హైదరాబాదుకి బస్సులో ప్రయాణిస్తూ వుంటుంది. ఆవిడకి ఓ ముఫ్ఫై యేళ్ళు. ఇద్దరు పిల్లలూ హైదరాబాదులో చదువుకుంటున్నారు. భర్త ఓ వున్నతోద్యోగి. యేదో వుద్యోగ పని మీదే వెళ్ళి తిరిగి వస్తూంది ఆవిడ.

బస్సులో రకరకాల జనం. వాళ్ళలో తనకి యెడం పక్క వున్న సీట్లలో ఓ అబ్బాయి--35 యేళ్ళవరకూ వుండచ్చు--స్ఫురద్రూపి, గిరజాల జుట్టూ, నవ్వే కళ్ళూ వగైరా--అయినా చాలా హుందాగా వుంటాడు.

తీరా కొంత దూరం వెళ్ళేటప్పటికి, బస్సు బ్రేక్ డౌన్ అవుతుంది. డ్రైవరూ, కండక్టరూ తిప్పలు పడి, వాళ్ళ వల్ల కాక, యేదో పార్టు తెచ్చి వెయ్యాలి--హైదరాబాదు నించే రావాలి--వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. రిపేరు అయ్యేసరికి పొద్దున్న ఆరు అవ్వచ్చు. ప్రయాణికులు మీ యేర్పాట్లు చేసుకొంటామంటే, టిక్కెట్టు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం. లేకపోతే, మాతో ఇదే బస్సులో పొద్దున్న 6 గంటలకి బయలుదేర వచ్చు--అని ప్రకటించేస్తారు.

ప్రయాణికులంతా దొరికిన లారీనో ఇంకోటో పట్టుకొని వెళ్ళిపోతూంటారు. హీరోయిన్ ఓ పక్కా, హీరో ఓ పక్కా నిలబడి కాలక్షేపం చేస్తూండగా, అబ్బాయి అడుగుతాడు--మీతో యెవరూ లేరా? ఒక్కళ్ళే వెళుతున్నారా?--అని. 

అవునని సమాధానం ఇచ్చిన ఆమె, మీరూ అంతేననుకుంటా--అని, ఇక్కడ నిలబడి దిక్కులు చూసే బదులు, దగ్గర్లో యేదో వూరు వున్నట్టుంది--యెలాగా వెన్నలగానే వుంది కాబట్టి, నడుచుకుంటూ ఆ వూరు చేరితే, పొద్దున్న వరకూ అక్కడెక్కడైనా కూచోవచ్చేమో? అంటుంది.

రెండు ఫర్లాంగులు నడిచేటప్పటికి, ఓ యెత్తరుగుల ఇల్లు కనిపించి, ఇద్దరూ ఓ అరుగు మీద కూర్చుంటారు. అప్పటికే రాత్రి పదకొండు అయి వుంటుంది.

ఆలికిడికి నిద్రలేచిన ఆ యింటావిడ బయటికి వచ్చి, విషయం తెలుసుకొని, 'అయ్యో! తెల్లవార్లూ అరుగుమీద కాలక్షేపం చెయ్యడమెందుకు? మా అబ్బాయీ కోడలూ వేరే వూరు వెళ్ళారు. పిల్లలతో నేనొక్కదాన్నే లంకంత కొంపలో వున్నాను--వాళ్ళ గది కాళీగానే వుంది--మీరు ఆ గదిలో వుండి, పొద్దున్నే లేచి వెళ్ళవచ్చు ' అని మొహమాట పెట్టేస్తుంది వాళ్ళని భార్యా భర్తలనుకొని.

వాళ్ళ మనసుల్లో యేమున్నా, యెందుకొచ్చిన గొడవ అని సరే అనేస్తారు. ఆవిడ ఆ గది తలుపు తీసి, తినడానికి యేవో, మంచినీళ్ళూ పెట్టి, 'తలుపేసుకోండమ్మా--పొద్దున్నే లేపుతాను!' అంటూ వెళ్ళిపోతుంది.

ఆ రాత్రి ఇద్దరూ నిద్రపోలేదు!

ఉదయాన్నే అయిదున్నరకి బయటికి వచ్చి, ఇంటావిడకి చెప్పి, బయలుదేరతారు బస్సు దగ్గరకి.

'మీ ఫోన్ నెంబరు.......' అని అబ్బాయి అడగబోతే, 'ప్లీజ్! నిన్నరాత్రి ఈ దోవలో మనం యెలా అపరిచితులమో, అలాగే విడిపోదాం. మళ్ళీ మనం ఒకర్నొకరు కలవడానికి ప్రయత్నించద్దు. మీకెప్పుడైనా ఇంకో స్త్రీతో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరూ, నాకవకాశం వస్తే నేనూ ఈ మధుర ఙ్ఞాపకాన్ని గుర్తు చేసుకుందాం--అంతే!' అంటుంది.

తరవాత కథ కంచికీ, మనం ఇంటికీ!

ఆ రోజుల్లోనే ఇలాంటి కథ వ్రాసిన రచయిత్రికి హేట్సాఫ్ చెపుదామా?

6 comments:

శరత్ చంద్ర said...

Mr and Mrs Iyer ani aa madhya oka cinema vachindi. Chaala varaku idhe katha.Kani cinema lo iddaru intha bold ga kalavaru. Just okarante okariki feelings erpadathaayanthe.

A K Sastry said...

డియర్ Sharath Sahithi!

చాలా సంతోషం. ఆ సినిమా నేను చూడలేదు గానీ, బావుంటుందనిపిస్తోంది.

ధన్యవాదాలు.

Ekalavya said...

ఇన్నాళ్ళూ 'అడల్ట్ కంటెంట్' అంటే భయపడి, మీ చానల్ చూడలేదు.

నేనూ మేజర్నే కాబట్టి చూడొచ్చు అని చూశాను.

సరసం గానే రాస్తున్నారు.

మా తాతగారు చెప్పేవారు. ఏ ఊళ్ళో అయినా సంతానానికి, ముఖ్యం గా ఆడ పిల్లలకి, పుట్టినప్పటినించీ ప్రతీ విషయానికీ (తొట్లో పెట్టడం, నామకరణం దగ్గరనించీ, ఈడేరడం, పెళ్ళీ, వాళ్ళకి సంతానం....ఇలా) ఓ పేరంటం పెట్టి, వూరందరికీ తెలిపేవారట.....అది సక్రమ సంతానమే అని నిరూపించుకోడానికి.

సంతానం గొడవే లేనప్పుడు, 'ఆ విషయానికి ' యెందుకంత ప్రాముఖ్యం?

మీ అభిప్రాయాలు చాలా నచ్చాయి.

A K Sastry said...

డియర్ Ekalavya!

కొంతమంది కుర్రవాళ్ళు ముందుతరం దూతలు.

కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృధ్ధులు.

మనం దేంట్లో వుండాలా అని నిర్ణయించుకోవలసింది--కుర్రవాళ్ళే!

మీరు మొదటి తరగితికి చెందుతారనిపిస్తోంది.

కీపిటప్.

ధన్యవాదాలు.

Anonymous said...

మా వూళ్ళో పాపం ఆడాళ్ళకూ మగాళ్లకూ... చాలా మందికి ఇలానే జరుగుతుంది...కాకపోతే ప్రతీ రోజు..[ఎంత కాలం అణచిపెట్టేస్తారూ ప్రకృతిని? అది సునామీ లను సృష్టిస్తుంది ఎప్పటికైనా..]

A K Sastry said...

డియర్ kvsv!

మీ వూళ్ళోనే కాదు--ప్రతీ వూళ్ళోనూ జరుగుతున్నది ఇదే!

ప్రకృతిని అణచిపెట్టక్కర్లేదని వొప్పుకుంటారా?

ముఖ్యం గా సంతానం గొడవ లేనప్పుడు?

మీ వ్యాఖ్య కొంచెం ఆలస్యం గా చూశాను.

మీరు నా వ్యాఖ్య చూస్తారనే వ్రాస్తున్నాను.

ధన్యవాదాలు.